ఇకపై ‘తెలుగు’ తప్పనిసరి

News

తెలంగాణలో ప్రతి విద్యార్థి తెలుగు చదివేలా తెలంగాణ ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానుంది. తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకురానున్న చట్టాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు విద్యాశాఖ అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పని సరి చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను త్వరలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే విధానాల రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కమిటీ సభ్యులుగా ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ నవంబర్‌ 15లోగా తెలుగు తప్పనిసరిపై విధానాన్ని రూపొందించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అంతేగాక.. ఈ చట్టాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఇతర భాషల మీడియాల్లో తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా.. తెలుగు కచ్చితంగా నేర్చుకోవాలి. తెలుగు భాష తప్పనిసరి సబ్జెక్టు అంశంపై సమావేశంలో డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *