రాజన్న జిల్లాకు రానున్న స్పెషలిటీ ఆసుపత్రి..?

News

★ సర్కారీ వైద్యం సూపర్‌ స్పెషల్‌!
★ 10 పాత జిల్లా కేంద్రాల్లో
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు
★ కొత్త జిల్లాల్లో స్పెషాలిటీ ఆస్పత్రులు
★ ఒకట్రెండు రోజుల్లో రానున్న జీవో
★ స్పెషాలిటీల్లో 16 రకాల సేవలు
★ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం

వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ఆధునికీకరించాలని సంకల్పించింది. ఉమ్మడి పాత 10 జిల్లాల్లోని ఆస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చాలని, 21 కొత్త జిల్లాల్లోని ఆస్పత్రులను స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చాలని నిర్ణయించింది.

ఇందుకుగాను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆర్థికశాఖ నుంచి కూడా ఆమోదం లభించింది. సర్కారు నిర్ణయంలో భాగంగా.. తొలుత జిల్లా ఆస్పత్రులను గుర్తిస్తూ ఒకట్రెండు రోజుల్లో జీవో జారీకానుంది.

ఈ మేరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చుతారు. కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో జిల్లా ఆస్పత్రి ఏదనేది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే కొన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు రావడంతో, అక్కడున్న జిల్లా ఆస్పత్రిని అదే జిల్లాలోని మరో ప్రాధాన్యం గల ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇదే పరిస్థితి కొన్ని జిల్లాల్లో ఉంది. ఇలాంటి చోట్ల తొలుత జిల్లా ఆస్పత్రి ఏదనేది గుర్తిస్తారు. ఇక 21 కొత్త జిల్లాల్లో స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే అధికారులు జాబితాను తయారు చేశారు. ఒకేసారి అన్ని జిల్లాల్లో స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కావడం విప్లవాత్మకమైన మార్పుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

జిల్లా ఆస్పత్రితో కలిగే సౌకర్యాలివే

జిల్లా ఆస్పత్రి ఏర్పడినా, లేదా ఉన్న ఏరియా ఆస్పత్రి, డిస్ట్రిక్‌ హాస్పిటల్‌గా మారినా.. ఆ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఉంటారు. జిల్లా ఆస్పత్రికి 300 పడకలు వస్తాయి. దీనికి తోడు.. మతాశిశు సంరక్షణ కేంద్రం, ఐసీయూ, డయాలసిస్‌ యూనిట్‌, ఎస్‌ఎన్‌సీయూ సేవలు అందుబాటులోకి వస్తాయి. కాగా, ఈ ఆస్పత్రులకు సంబంధించిన సిబ్బందిని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒకే చేసింది.

స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 16 రకాల సేవలు

కొత్త జిల్లా ఆస్పత్రులను స్పెషాలిటీ ఆస్పత్రులుగా మార్చితే.. పదహారు రకాలైన సేవలు అందుబాటులోకి వస్తాయి. గుండె, కిడ్నీ, మెదడు, కేన్సర్‌, కాలేయాలకు సంబంధించి రెండు రకాల సర్జరీలు, జనరల్‌మెడిసిన్స్‌, రుమటాలజీ, ఫల్మానాలజీ, డయాగ్నస్టిక్స్‌, ఫిజియోథెరపీ, ఫ్లాస్టిక్‌ సర్జరీ, ఆర్థోపెడిక్‌ లాంటి మొత్తం పదహారు రకాల సేవలు స్పెషాలిటీ ఆస్పత్రులో విభాగంలో లభ్యమవుతాయి.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో దాదాపు అన్నిరకాలైన అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *